Telangana Tunnel Collapse Update : శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ మార్గంలో సహాయక చర్యలను వేగవంతం చేసి సొరంగంలో చిక్కుకున్న 8మందిని బయటకు తెచ్చేందుకు రెండు రోజుల కార్యచరణ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. రెస్క్యూ ఆపరేషన్లకు అడ్డంకిగా నిలిచిన టన్నల్ బోరింగ్ మిషన్ అవశేషాలు, నీరు, బురద, పూడికను తొలగించి ప్రమాద స్థలానికి చేరుకోవాలని నిర్ణయించింది. సొరంగంలో చిక్కుకున్న 8మంది జాడను కనిపెట్టడమే లక్ష్యంగా ఆపరేషన్ నిర్వహించనుంది.14 కిలోమీటర్ల సొరంగంలో 11.5 కిలోమీటర్ల వరకు ఎలాంటి అటంకాలు లేవు.
లోకో ట్రైన్‌ను వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత రెండుమూడు అడుగుల వరకూ నీరు నిండి ఉంటోంది. ఇది లోకో ట్రైన్ ప్రయాణానికి అడ్డంకిగా మారుతోంది. అందుకే వేగంగా డీవాటరింగ్ చేసి నీటిని తొలగించాలని అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత సహాయక చర్యలకు అంతరాయం కలిగిస్తున్న అంశం టన్నల్ బోరింగ్ మిషన్ అవశేషాలు.14వ కిలోమీటర్ వద్ద పెద్ద ఎత్తున మట్టి కుప్పకూలడం, సెగ్మెంట్లు కుంగిపోవడం, వరద ఉద్ధృతి అధికంగా ఉండటంతో టన్నల్ బోరింగ్ మిషన్ వెనక భాగం అరకిలోమీటర్ వరకు కొట్టుకువచ్చింది.